ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లండన్‌లో ‘భారత్ - బ్రిటన్ ఆర్థిక మార్కెట్లపై చర్చ - 2026’ అనంతర ఉమ్మడి ప్రకటనకు ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2026 5:21PM by PIB Hyderabad

నాలుగవ బ్రిటన్ - ఇండియా ఫైనాన్షియల్ మార్కెట్స్ డైలాగ్ (ఎఫ్ఎండీ)ను 2026 సెప్టెంబర్ 29న లండన్‌లో నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, హెచ్‌ఎం ట్రెజరీల సీనియర్ అధికారులు ఈ చర్చలకు నేతృత్వం వహించగా... సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ), అంతర్జాతీయ ఆర్థిక సేవా సంస్థల ప్రాధికార సంస్థ (ఐఎఫ్‌ఎస్‌సీఏ), పింఛను, నిధుల నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఎ), భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార (ఐఆర్‌డీఏఐ), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీవోఈ), ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్‌సీఏ) సహా ఇరుదేశాల ఆర్థిక సేవల నియంత్రణ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2024 డిసెంబరులో నిర్వహించిన సమావేశ అనంతర పరిణామాల సమీక్షతో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. తమ తమ పరిధుల్లో చేపట్టిన సంస్కరణల సమాచారాన్ని ఇరుదేశాల ప్రతినిధులు వివరించారు. సుస్థిర ఆర్థిక వృద్ధి, పటిష్టమైన - పారదర్శకమైన ఆర్థిక మార్కెట్లు, ద్వైపాక్షిక వాణిజ్యం - పెట్టుబడులను మెరుగుపరచుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. మూలధన మార్కెట్లు, బీమా, పింఛన్లు, ఆస్తుల నిర్వహణ, ఫిన్‌టెక్ అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఫిన్‌టెక్, ఏఐ, హరిత - సుస్థిర ఆర్థిక విధానం, ఆస్తుల నిర్వహణ వంటి రంగాల్లో ప్రస్తుత నియంత్రణ ప్రక్రియల భాగస్వామ్యంతోపాటు... విధాన నిర్ణేతలు, నియంత్రణ సంస్థలు, పరిశ్రమల మధ్య ఆచరణాత్మక సహకారంలో ‘భారత్ - బ్రిటన్ ఆర్థిక భాగస్వామ్యం (ఐయూకేఎఫ్‌పీ)’ పాత్రను ఇరువర్గాలు స్వాగతించాయి.

మూలధన మార్కెట్లు

ఇరుదేశాల ప్రతినిధులు తమ పరిధిలో మూలధన మార్కెట్లలో చేపట్టిన సంస్కరణలను వివరించారు. భారత్ తరఫున... మార్కెట్ ప్రవేశం, నిర్వహణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో వస్తున్న మార్పులను సెబీ వివరించింది. విదేశీ పెట్టుబడిదారులకు సార్వభౌమ, కార్పొరేట్ బాండ్ల సేకరణలో సౌలభ్యం మెరుగుపడడాన్ని ఆర్‌బీఐ వివరించింది. భారత్‌లోకి విదేశీ మూలధనాన్ని ఆకర్షించడంలో ‘గుజరాత్ అంతర్జాతీయ ఆర్థిక టెక్-సిటీ అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ) పాత్రపైనా వారు చర్చించారు. అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీని రూపుదిద్దేందుకు ఎప్పటికప్పుడు కావాల్సిన నియంత్రణపరమైన సహకారానికి, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

గిఫ్ట్ - ఐఎఫ్‌ఎస్‌సీ ద్వారా అంతర్జాతీయ ఈక్విటీలు, బాండ్ల నమోదుతోపాటు.. పెట్టుబడులు, భారతీయ సంస్థలకు అంతర్జాతీయ మూలధన మార్కెట్ల లభ్యత, వాటితో బలమైన అనుసంధానంపై ప్రతినిధులు చర్చించారు. తదుపరి ‘ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్’ భేటీకి ముందే.. భవిష్యత్తులో మూలధన మార్కెట్ల సహకారానికి సంబంధించి ప్రాధాన్యతా రంగాలను గుర్తించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

బీమా, పింఛన్లు

ఇరుదేశాల ప్రతినిధులు తమ బీమా, పింఛను రంగాల సంస్కరణలతోపాటు మార్కెట్ అవకాశాలపై చర్చించారు. ఆర్థిక సేవల వృద్ధి, పోటీతత్వ వ్యూహంలో భాగంగా.. బీమా నియంత్రణ వ్యవస్థలో చేసిన తాజా మార్పులను, అలాగే పింఛను, యాన్యుటీ మార్కెట్లలో పరిణామాలను బ్రిటన్ వివరించింది. మరోవైపు భారత్... బీమా పరిధిని విస్తరించడం, పెట్టుబడులు, మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడంపై తన లక్ష్యాలను వెల్లడించింది. బీమా రంగ అభివృద్ధి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సహకారం దిశగా... 2023లో రూపొందించిన ‘బీమా, పింఛన్ల కార్య ప్రణాళిక’ ప్రాధాన్యాన్ని ఇరుపక్షాలు అంగీకరించాయి.

పోటీతత్వంతో కూడిన పటిష్టమైన మార్కెట్లు, నిపుణుల సేవలు, వివిధ మూలధన వనరులు, పునర్బీమా సామర్థ్యం వంటి అంశాలు సంక్లిష్టమైన ప్రమాదాలను ఎదుర్కొనడానికీ, సుదీర్ఘ దేశీయ అభివృద్ధికీ ఎంతగానో తోడ్పడతాయన్న అభిప్రాయాన్ని ప్రతినిధులు వ్యక్తం చేశారు. భారత్‌లో రూపుదిద్దుకుంటున్న కొత్త నియంత్రణ విధానాల ద్వారా, లండన్ మార్కెట్ - భారతీయ బీమా, పునర్బీమా సంస్థల మధ్య పటిష్టమైన సహకారం ద్వారా.. పునర్బీమా రంగంలో లభిస్తున్న అవకాశాలపై ఇరుపక్షాలు చర్చించాయి.

పింఛన్ల నియంత్రణ, పాలన యంత్రాంగం, సామాజిక భద్రతా పరిధి విస్తరణ, దీర్ఘకాలిక పొదుపు సంస్కరణల్లో అనుభవాలను ఇరుదేశాల ప్రతినిధులు వెల్లడించారు. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు, లాభదాయకమైన దీర్ఘకాలిక పెట్టుబడులకు సహకరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. దేశీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్న రంగాల్లో విజ్ఞానాన్ని ఇచ్చుపుచ్చుకునేందుకూ ఇరుపక్షాలు అంగీకరించాయి.

నియంత్రణ సహకారం: ఆస్తి నిర్వహణ, సుస్థిర ఆర్థిక వనరులు

ఆర్థిక వనరుల నిర్వహణ సంబంధిత నియంత్రణ విధానాలు, మార్కెట్ పరిణామాలపై బ్రిటన్, భారత్ చర్చించాయి. ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల నిర్వహణ కోసం నియంత్రణ విధానాల రూపకల్పన చర్యలను బ్రిటన్ వివరించింది. కాగా సెబీ, ఐఎఫ్‌ఎస్‌సీఏ తమ పరిధిలోని విధానాల్లో చేపట్టిన కీలక సంస్కరణలను భారత్ వివరించింది. ఆస్తుల నిర్వహణ రంగంలో నియంత్రణ సహకారాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి. సంస్కరణలు, పెట్టుబడిదారుల అవసరాలు, మార్కెట్ పరిస్థితులపై పరస్పర అవగాహన వల్ల విదేశీ పెట్టుబడులు పెరిగే తీరుపైనా చర్చించాయి.

భారత రూపాయి అంతర్జాతీయీకరణ మరింత విస్తరించడాన్ని ఇరుదేశాలు స్వాగతించాయి. విదేశాల్లో రూపాయి ట్రేడింగ్‌లో లండన్ ప్రధాన కేంద్రంగా నిలిచి, కీలక పాత్ర పోషించడాన్ని ఇరుపక్షాలు అంగీకరించాయి. సుస్థిర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి.. పర్యావరణ అనుకూల, వాతావరణ మార్పులను తట్టుకోగల ప్రాజెక్టుల కోసం ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో నమ్మకమైన విధానాలు, పారదర్శకంగా ఉండే ప్రకటనలు, అంతర్జాతీయ ప్రమాణాలు, పెట్టుబడిదారుల విశ్వాసం ప్రాధాన్యంపై ప్రతినిధులు చర్చించారు.

ఐయూకేఎఫ్‌పీ ఆస్తుల నిర్వహణ విభాగం పురోగతిని ప్రతినిధులు సమీక్షించారు. బ్రిటన్, భారతీయ ఆర్థిక వనరుల నిర్వాహకులు ఒకరి మార్కెట్లలో ఒకరు మరింత క్రియాశీలంగా పాల్గొనేందుకు గల ఆచరణాత్మక అవకాశాలను గుర్తించడంలో పరిశ్రమ ప్రాతిపదికగా ఉన్న సమాచారం ఎంతో విలువైందని అంగీకారానికి వచ్చారు.

ఫిన్‌టెక్, ఆవిష్కరణ

ఫిన్‌టెక్, ఆవిష్కరణల విషయంలో తమ విధానాలను ఇరుదేశాల ప్రతినిధులు వివరించారు. డిజిటల్ గుర్తింపు, డిజిటల్ చెల్లింపులు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు (సీబీడీసీలు), సమాచార భాగస్వామ్య వ్యవస్థలతో కూడిన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ద్వారా ఫిన్‌టెక్ వినియోగాన్నీ, ఆర్థిక సమ్మిళితత్వాన్నీ దేశంలో విస్తరించిన తీరును భారత్ వివరించింది.

నియంత్రణ పరిధిలో రాజీ పడకుండానే.. బాధ్యతాయుతమైన ఆవిష్కరణలను, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం ఆవశ్యకమని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఆర్థిక సేవల్లో కృత్రిమ మేధ ద్వారా లభించే అవకాశాలు, ఎదురయ్యే ముప్పులపై అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు.. సంబంధిత అంతర్జాతీయ వేదికల్లో నిరంతర ద్వైపాక్షిక చర్చలు, సమన్వయాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించాయి. రిటైల్ ఆర్థిక సేవల కోసం చేపట్టిన డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను భారత్ వివరించింది. తన అనుభవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. అదే సమయంలో విదేశాల్లో నడుస్తున్న ‘స్కామ్ కాంపౌండ్ల’ ద్వారా ఏఐని ఉపయోగించి భారీ మోసాలకు పాల్పడడం, కొత్త సాంకేతికతలను నేరస్తులు దుర్వినియోగం చేయడం వల్ల ఆర్థిక నేరాలు, సైబర్ భద్రతతోపాటు డేటా రక్షణ, నిర్వహణ స్థిరత్వానికి ఎదురవుతున్న ప్రమాదాన్ని ఇరుపక్షాల ప్రతినిధులు ప్రస్తావించారు. ఆర్థిక మోసాలను గుర్తించి, నివారించడానికి సాంకేతికత, సమర్థమైన నియంత్రణల వినియోగంలో తమ అనుభవాలను ఇరుపక్షాలు వివరించాయి. సంబంధిత అధికారిక సంస్థల మధ్య సహకారాన్ని కొనసాగించేందుకు అంగీకరించాయి.

దేశాల మధ్య చెల్లింపులను సులభతరం చేసే ‘జీ 20 ప్రణాళిక’కు ఇరుపక్షాలు మద్దతును పునరుద్ఘాటించాయి. ఈ కార్యాచరణకు అనుగుణంగా... దేశాల నడుమ చెల్లింపుల్లో అడ్డంకులను తగ్గించడం, పారదర్శకతను పెంచడం, వాటిని మరింత సమర్థంగా తీర్చిదిద్దడం వంటి ఆచరణాత్మక ప్రాధాన్య అంశాలపై చర్చించాయి. తమ దేశాల రిటైల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలలో తాజా పరిణామాలను పంచుకోవడంతోపాటు.. డిజిటల్ చెల్లింపు వ్యవస్థల పరస్పర అనుసంధానాన్ని ప్రోత్సహించడం కోసం జీ 20 వేదికగా జరుగుతున్న కృషిని ఇరుపక్షాలు గుర్తించాయి.

భవిష్యత్ సహకారం

నిర్మాణాత్మక చర్చలను భారత్, బ్రిటన్ స్వాగతించాయి. సుస్థిర వృద్ధి, బలమైన వాణిజ్యం - పెట్టుబడులు, పటిష్టమైన ఆర్థిక మార్కెట్ల విషయంలో సమష్టి లక్ష్యాలకు తోడ్పాటునందించడంలో ఎఫ్ఎండీ విశేష కృషి చేస్తోందని పునరుద్ఘాటించాయి. ఆర్థిక సేవల అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ఆచరణాత్మక మార్గాలను గుర్తించడంలో ఐయూకేఎఫ్‌పీ కృషిని స్వాగతించాయి. విజన్ 2035 ఆవిష్కరణ నేపథ్యంలో... బలోపేతమైన ద్వైపాక్షిక సంబంధాలపై ఇరుదేశాలు ప్రత్యేకంగా చర్చించాయి. అలాగే 2026 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చిన ‘బ్రిటన్ - భారత్ సమగ్ర ఆర్థిక, విదేశీ వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)’ అమలును మరింత వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతనూ స్పష్టం చేశాయి.

వివిధ విభాగాల్లో మరింత పురోగతి సాధించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. అలాగే సంబంధిత ద్వైపాక్షిక యంత్రాంగాల ద్వారా, రాబోయే యూకే-ఇండియా ఎకనామిక్, ఫైనాన్షియల్ డైలాగ్ భేటీలో ఈ తాజా పరిణామాలను సమీక్షించాలని నిర్ణయించాయి.  

***


(రిలీజ్ ఐడి: 2320710) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Tamil , Malayalam