రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారులపై వన్యప్రాణుల సంరక్షణ చర్యలను బలోపేతం చేయడాన్ని తెలియజేసే ‘వన్యప్రాణులపై దుష్ప్రభావాన్ని తగ్గించే చర్యలు- నిర్మాణాలు’ అనే అంశంపై ఒక పత్రాన్ని విడుదల చేసిన ఎన్హెచ్ఏఐ
గత ఐదు సంవత్సరాల్లో వన్యప్రాణుల సంరక్షణ మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం రూ. 19,700 కోట్లకు పైగా పెట్టుబడులు
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 2,150కి పైగా వన్యప్రాణులపై దుష్ప్రభావాన్ని తగ్గించే నిర్మాణాలను ఏర్పాటు చేసిన లేదా ప్రతిపాదించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2026 6:22PM by PIB Hyderabad
జాతీయ రహదారుల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో వన్యప్రాణులపై దుష్ప్రభావాన్ని తగ్గించే చర్యలను ఒక భాగంగా చేసే దిశగా చేపట్టిన కార్యక్రమాలను తెలియజేస్తూ 2026 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించిన ‘జాతీయ వన్యప్రాణి వారోత్సవాల’ సందర్భంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ‘వన్యప్రాణులపై దుష్ప్రభావాన్ని తగ్గించే చర్యలు-నిర్మాణాలు’ అనే అంశంపై ఒక పత్రాన్ని విడుదల చేసింది. గుజరాత్లోని ఏక్తా నగర్లో నిర్వహించిన ‘చింతన్ శిబిర్’ సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ పత్రాన్ని ఇటీవల విడుదల చేశారు. పర్యావరణ సుస్థిరత, వన్యప్రాణుల సంరక్షణతో పాటు రవాణా, అనుసంధానత అవసరాలను సమతుల్యం చేస్తూ జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ఎన్హెచ్ఏఐ విధానాన్ని ఈ పత్రం తెలియజేస్తోంది.
గత ఐదు సంవత్సరాల్లో జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో వన్యప్రాణుల సంరక్షణ మౌలిక సదుపాయాలు, సంబంధిత పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం సుమారు రూ. 19,700 కోట్లు ఖర్చు చేశారు. రవాణా భద్రతను కూడా నిర్ధారించటంతో పాటు ఆవాసాల విభజన, అడ్డంకుల ప్రభావం(బ్యారియర్ ఎఫెక్ట్స్), వన్యప్రాణులు-వాహనాల మధ్య సంఘర్షణలు వంటి జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రాజెక్ట్ కారిడార్ల పర్యావరణ సున్నితత్వం, వన్యప్రాణుల సంచార నమూనాలు, మౌలిక సదుపాయాల రూపకల్పన విషయంలో సాంకేతిక సాధ్యత ఆధారంగా సంరక్షణ ప్రణాళికను ఎన్హెచ్ఏఐ రూపొందిస్తోంది. దీనివల్ల ఆయా రహదారి కారిడార్ల నిర్దిష్ట పర్యావరణ, ఇంజనీరింగ్ అవసరాలకు తగినట్లుగా వన్యప్రాణులపై దుష్ప్రభావాన్ని తగ్గించే చర్యలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం సాధ్యపడుతుంది.
2,150కి పైగా వన్యప్రాణులపై దుష్ప్రభావాన్ని తగ్గించే నిర్మాణాలు
అండర్పాస్లు, ఓవర్పాస్లు, కల్వర్టులు, కెనాపీ క్రాసింగ్లు వంటి నిర్మాణపరమైన చర్యలతో పాటు సూచికలు, కంచె, వేగ నియంత్రణ వంటి నిర్మాణరహిత చర్యలను మిళితం చేస్తూ వన్యప్రాణులపై దుష్ప్రభావాన్ని తగ్గించే ప్రణాళిక కోసం ఈ పుస్తకం ఒక వ్యవస్థీకృత విధానాన్ని రూపొందించింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 2,150కి పైగా వన్యప్రాణులపై దుష్ప్రభావాన్ని తగ్గించే నిర్మాణాలను నిర్మించారు లేదా ప్రతిపాదించారు. వీటిలో ఏయూపీలు (యానిమల్ అండర్ పాస్లు), మేజర్ బ్రిడ్జ్-కమ్-ఏయూపీలు, మైనర్ బ్రిడ్జ్-కమ్-ఏయూపీలు వంటి వంతెనతో కూడిన క్రాసింగ్లు, జంతువుల సంచారానికి అనుగుణంగా మార్పు చేసిన కల్వర్టులు, కెనాపీ క్రాసింగ్లు, ఇతర ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి.
దుష్ప్రభావాన్ని తగ్గించే సంస్థాగత చర్యల్లో భాగంగా జంతువుల అండర్పాస్ల కోసం సుమారు రూ. 4,600 కోట్లు, జంతువుల ఓవర్పాస్ల కోసం రూ. 650 కోట్లు, వయాడక్ట్ల కోసం రూ. 8,300 కోట్లు, సొరంగాల కోసం రూ. 2,800 కోట్లు, ప్రధాన వంతెనల కోసం రూ. 2,500 కోట్లు, చిన్న వంతెనల కోసం రూ. 500 కోట్లు వెచ్చించారు. ఈ నిర్మాణాలు రహదారి కారిడార్లలో వన్యప్రాణుల సురక్షిత సంచారాన్ని సులభతరం చేస్తాయి.. ఆవాసాల మధ్య పర్యావరణ అనుసంధానతను కాపాడటానికి తోడ్పడతాయి.
శబ్ద నియంత్రణ బారికేడ్లు, సరీసృపాల క్రాసింగ్లు, వర్షపు నీటి సంరక్షణ, ఇతర వన్యప్రాణుల నిర్వహణ చర్యలు వంటి ఆవాసాల పరిస్థితులను మెరుగుపరచడానికి, అంతరాయాలను తగ్గించడానికి ఉద్దేశించిన అనేక రకాల నిర్మాణరహిత చర్యలతో ఎన్హెచ్ఏఐ ఈ సంస్థాగత చర్యలను మరింత పరిపుష్టం చేసింది.
వన్యప్రాణుల సంరక్షణ కోసం సమగ్ర విధానం
వన్యప్రాణులను నిర్దేశిత క్రాసింగ్ నిర్మాణాల వైపు మళ్లించడానికి, జంతువులు-వాహనాల మధ్య సంఘర్షణలు అయ్యే అవకాశాలను తగ్గించడానికి 300 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారి మార్గాల వెంట గైడ్ ఫెన్సింగ్, శబ్ద నియంత్రణ బారికేడ్లను ఏర్పాటుచేశారు.
వన్యప్రాణుల సంచార నమూనాలను అంచనా వేయడానికి, వన్యప్రాణులపై దుష్ప్రభావాన్ని తగ్గించే చర్యలను కాలానుగుణంగా పరిశీలించేందుకు కెమెరా ట్రాపింగ్ విధానంతో సహా పర్యవేక్షణ యంత్రాంగాలను కూడా ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేసింది. వన్యప్రాణులు-వాహనాలు ఢీకొనే ప్రమాదాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. వన్యప్రాణులకు, రహదారులపై ప్రయాణించే వారికి ముప్పును తగ్గించడానికి తగిన చర్యలలో భాగంగా వేగ నియంత్రణ బోర్డులు, సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణతో మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమతుల్యం చేయడం
జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పాలుపంచుకునే ఏజెన్సీలు, సంరక్షణ వర్గాల మధ్య సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా ఈ పత్రం ప్రధానంగా తెలియజేస్తోంది. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన వివిధ దశల్లో సంస్థాగత చర్యలను చేర్చేలా ఎన్హెచ్ఏఐ అనుసరించిన విధానం దోహదపడుతుంది. దీనివల్ల జీవవైవిధ్య పరిరక్షణ, చట్టబద్ధమైన పర్యావరణ అనుసమ్మత అవసరాలకు తగిన ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల విస్తరణను చేపట్టడం సాధ్యమవుతుంది. ఈ సమగ్ర పత్రం https://nhai.gov.in/nhai/sites/default/files/mix_file/NHAI-Wildlife_Mitigation_and_Structures.pdf ద్వారా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
ఇటీవలి కార్యక్రమాలు, చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను తెలియజేస్తోన్న ఈ పత్రం.. జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వివిధ పర్యావరణ పరిరక్షణ చర్యల అమలుపట్ల ఎన్హెచ్ఏఐకి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చేపడుతున్న వివిధ రకాల వన్యప్రాణులపై దుష్ప్రభావాన్ని తగ్గించే చర్యలు, నిర్మాణాలను కలిగి ఉన్న ఈ పత్రం ఒక రిఫరెన్స్ ఫ్రేమ్వర్క్గా పనిచేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2321178)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5