జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్, మాలీ ఆధ్వర్యంలో న్యూయార్క్‌.. ఐరాస ప్రధాన కేంద్రంలో ‘ప్రపంచ పత్తి దినోత్సవం

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2026 8:10AM by PIB Hyderabad

ప్రపంచ పత్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక కార్యక్రమాన్ని భారత- మాలీ శాశ్వత దౌత్య కార్యాలయాలు న్యూయార్క్‌.. ఐ.రా.స. ప్రధాన కేంద్రంలో నిర్వహించాయి. ‘‘దీర్ఘకాలిక అభివృద్ధి కోసం పత్తి: జీవనోపాధి మార్గాలు, విలువను పెంచడం, భాగస్వామ్యం’’ ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 75/318 తీర్మానాన్ని ఆమోదించి అక్టోబర్ 7ను ప్రపంచ పత్తి దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించింది. అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న దేశాలు, అవసరమైనంత అభివృద్ధిని త్వరలో సాధించనున్న దేశాల్లో ఆర్థికాభివృద్ధి సాధన, అంతర్జాతీయ వాణిజ్యం, పేదరికం నిర్మూలన లక్ష్యాలకు పత్తి ఎలా తోడ్పడగలదో ఈ దినోత్సవ నిర్వహణ కార్యక్రమం గుర్తు చేస్తుంది. ఈ కార్యక్రమంలో భారతదేశ పార్లమెంట్ సభ్యులు, సభ్య దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జీవనోపాధి కల్పన, విలువను పెంచడం, దీర్ఘకాలిక ప్రాతిపదికన అభివృద్ధి సాధన వంటి లక్ష్యాలకు పత్తి అందించగల తోడ్పాటు అంశంపై చర్చించారు. 

 

ఐ.రా.స.లో భారతదేశ శాశ్వత ప్రతినిధి, రాయబారి శ్రీ హరీశ్ పర్వతనేని కార్యక్రమంలో స్వాగతోపన్యాసాన్ని ఇచ్చారు. స్వయంసమృద్ధి, ఆత్మగౌరవం, భారత స్వాతంత్ర్య పోరాటంతో పత్తినీ, చరఖానూ మహాత్మా గాంధీ జోడించినట్లు శ్రీ హరీశ్ గుర్తు చేశారు. ఉత్పత్తిదారుల బతుకుదెరువుకు ఊతాన్ని ఇవ్వడం, విలువను పెంచే ప్రక్రియలతో పాటు, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, పత్తి రంగ భవితకు సుస్థిరత్వాన్ని కల్పించడం, సాంకేతికతనీ, భాగస్వామ్యాలనీ బలోపేతం చేయడం .. ఈ నాలుగు ప్రధాన అంశాలను ప్రస్తావించారు. పత్తిని పండించే దేశాలకు విలువను పెంచే ప్రక్రియల్లోనూ, స్థిర ప్రాతిపదికను కలిగి ఉండే అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్)ను సాధించే మార్గంలో ముందుకు పోవడంలోనూ సాయపడటానికి ముడి సరుకులు (ఇన్‌పుట్స్) తక్కువ ధరలకు సరఫరా అయ్యేటట్లు చూడడం, ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు, అభివృద్ధి చెందాలని తపిస్తూ పరస్పరం సహకరించుకుంటున్న దక్షిణార్థ గోళ దేశాలకూ, చిన్న వాణిజ్య సంస్థలకూ దన్నుగా నిలవాల్సిన, మూడు విధాలుగా సహకారాన్ని అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.  

ఐ.రా.స.లో మాలీ శాశ్వత ప్రతినిధి, రాయబారి శ్రీ ఈసా కోన్‌ఫోరు మాట్లాడుతూ, మాలీ ఆర్థిక వ్యవస్థలోనూ, గ్రామీణ ప్రాంతాల నివాసులకు జీవనోపాధి కల్పనలోనూ పత్తి ప్రధాన పాత్రను పోషిస్తోందన్నారు. శుద్ధి (ప్రాసెసింగ్) సామర్థ్యం పరిమితంగానే ఉండటం, ఇన్‌పుట్ వ్యయం, విశాల మార్కెట్టుకు కొదవ, వాణిజ్య అసమతౌల్యానికి తావిస్తున్న విధానాలు ఈ రంగంలో సవాళ్లను రువ్వుతున్నాయని ఆయన వివరించారు. దేశీయంగా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ మరింత మందికి ఉపాధిని కల్పించే దిశగా మాలీ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అభివృద్ధి చెందాలని తపిస్తూ పరస్పరం సహకరించుకుంటున్న దక్షిణార్థ గోళ దేశాల మధ్యే గాక ఇతరత్రా కూడా పరస్పర ప్రయోజనకరం కాగల భాగస్వామ్యాలు ఏర్పడాలని ఆయన సూచిస్తూ, ఈ విషయంలో భారత్ ఒక కీలక భాగస్వామిగా ఉంటోందని వెల్లడించారు.

 

సాంప్రదాయిక చేతివృత్తి పనివారు పత్తికి అదనపు విలువను ఎలా జత చేయగలుగుతున్నదీ, మహిళలు ఎలా బతుకుదెరువును పొందుతున్నదీ, వనరులను తిరిగి ఉపయోగిస్తున్నదీ పార్లమెంట్ సభ్యుడు శ్రీ అసిత్ కుమార్ మల్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన పశ్చిమ బంగాల్.. బోల్‌పూర్‌లో కంథా బుటేదారు పనిని గురించి సభకు తెలియజేశారు. చేతివృత్తిదారులకు గిట్టుబాటయ్యే పారితోషికం, తక్కువ వడ్డీకి రుణాలు, డిజైన్ల కూర్పులో సాయంతో పాటు వారి ఉత్పాదనలు మార్కెట్ల వరకూ చేరుకోవడంలో మార్గదర్శనం అవసరమని ఆయన కోరారు.

 

పత్తిని నేసి వివిధ దుస్తులను రూపొందించడం, చిన్న వాణిజ్య సంస్థలు పోషిస్తున్న పాత్ర, మౌలిక సదుపాయాలను కలిసికట్టుగా వినియోగించుకోవడం, చేయి తిరిగిన పనివారు వంటి అంశాల్లో తమిళ నాడు సంపాదించిన అనుభవాన్ని పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఎల్.కె. సుధీశ్ ప్రస్తావించారు. పీఎం మిత్ర కార్యక్రమంలో భాగంగా ఏకీకృత టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారనీ, టెక్స్‌టైల్ ప్రాసెసింగులో వ్యర్థ జలాలను పునర్వినియోగిస్తున్నారన్నీ ఆయన తెలిపారు.

 

పత్తి సాగులోనే కాక పత్తి వినియోగంలో కూడా భారత్ భూమిక, ఈ రంగంలో చిన్న-సన్నకారు రైతులకు ఉన్న ప్రాముఖ్యంపై కేంద్ర జౌళి శాఖ సంయుక్త కార్యదర్శి పద్మిని సింగ్‌లా మాట్లాడారు. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ, కస్తూరి కాటన్ భారత్ కార్యక్రమం తీరుతెన్నులను వివరించారు. ఉత్పాదకతను, నాణ్యతను, ట్రేసబులిటీని మెరుగుపరచడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. జౌళి రంగ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో పెట్టుబడులు, చేతివృత్తి కార్మికులకూ, చిన్న వాణిజ్య సంస్థలకూ సాయాన్ని అందించడం, పత్తి వేల్యూ చైన్లు సుదీర్ఘకాలం పాటు మనుగడలో ఉండటానికి వీలుగా ఆంక్షలకు చోటు ఉండని, ప్రతికూలతలకు తావు ఇవ్వని వాణిజ్య విధానాలు, మార్కెట్టు లభ్యత కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

 

కార్యక్రమంలో ప్రసంగించిన వారిలో కోటే డీ ఐవర్, ఉజ్బెకిస్తాన్, చాడ్, నెదర్లాండ్స్, బుర్కానా ఫాసో, ఈజిప్టులకు చెందిన శాశ్వత ప్రతినిధులు, కామెరూన్, పెరూ ల ఉప శాశ్వత ప్రతినిధులు, న్యూయార్క్‌లోని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ సంబంధాల కార్యాలయం డైరెక్టరు ఏంజెలినా జైకోమ్, అంతర్జాతీయ పత్తి సలహా సంఘం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కేశవ్ ఆర్. క్రాంతి ఉన్నారు. పత్తి విలువ వ్యవస్థల్ని పటిష్ఠపరచడం, చిన్న రైతులకు, చేతివృత్తి పనివారికి ఊతాన్ని ఇవ్వడం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్నీ, మార్కెట్టు లభ్యతనీ పెంచడం, సాంకేతికత పరిజ్ఞానం, ఉన్నత విజ్ఞానం ఉపయోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరింప చేసుకొనేందుకు అవకాశాలు ఏ మేరకు ఉన్నదీ ప్రధానంగా చర్చించారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కొందరు ఉత్సాహంగా ముందుకు వచ్చి భారత సుసంపన్న హస్తకళా సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన పత్తి వస్త్రంపై పెన్ కలంకారీ పనితనాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. భారతదేశానికి చెందిన ఓ నిపుణుడు ఇందుకు సహకరించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2321249) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Gujarati