ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వైద్యులు సూచించాల్సిన ఔషధాలపై రిటెయిలర్లు, టోకు వ్యాపారులు ఇస్తున్న వాణిజ్య ప్రకటనలపై
నియంత్రణలను కఠినతరం చేయాలని ప్రతిపాదించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
షెడ్యూల్ హెచ్, హెచ్1, ఎక్స్ ఔషధాల వాణిజ్య ప్రకటనలపై ప్రస్తుతం ఉన్న పరిమితులను ఔషధ రిటైలర్లు, టోకు వ్యాపారులు, పంపిణీదారులకు విస్తరించాలని ప్రతిసాదిస్తున్న ముసాయిదా సవరణ
ప్రిస్క్రిప్షన్ ఔషధాల అనధికార ప్రచారాన్ని అరికట్టడం, ప్రజారోగ్య రక్షణను బలోపేతం చేయడమే ఈ చర్య లక్ష్యం
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 11:10AM by PIB Hyderabad
వైద్యులు మాత్రమే సూచించాల్సిన ఔషధాలకు సంబందించిన వాణిజ్య ప్రకటనల నియంత్రణలను బలోపేతం చేయడానికి ఔషధ నియమాలు–1945కు సవరణలను కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ హెచ్1, షెడ్యూల్ ఎక్స్ పరిధిలో నిర్దేశించిన ఔషధాలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ముందస్తు అనుమతులను ఔషధాల అమ్మకం, పంపిణీ లైసెన్సులను కలిగి ఉన్న సంస్థలకు సైతం విస్తరించాలని ఈ సవరణ ప్రతిపాదించింది.
డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ)తో సంప్రదింపుల అనంతరం 2026 సెప్టెంబర్ 28న ప్రచురించిన జీఎస్ఆర్ 861(ఈ) గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ముసాయిదా సవరణను నోటిఫై చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న నియంత్రణల ప్రకారం షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ హెచ్1, షెడ్యూల్ ఎక్స్ పరిధిలోకి వచ్చే ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఫార్మాసూటికల్ తయారీదారులు ప్రచారం చేయడం నిషిద్ధం. అయితే ఈ ఔషధాల రిటెయిల్, టోకు అమ్మకాలు, పంపిణీలో భాగస్వామ్యులైన సంస్థలను ఈ నిబంధనల పరిధిలోకి స్పష్టంగా చేర్చలేదు.
నియంత్రణాపరమైన ఈ లోపాన్ని పరిష్కరించేందుకు ఔషధ నియమాలు–1945 లోని నియమం–65 లో ఉప నియమం (22)ను చేర్చాలని మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. రిటెయిల్, హోల్‌సేల్ ఔషధ లైసెన్సులను కలిగి ఉన్నవారితో సహా ఔషధాలను అమ్మడానికి, నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి లేదా అమ్మకం కోసం సరఫరా చేయడానికి లైసెన్సులు ఉన్నవారికి సైతం వాణిజ్య ప్రకటనల నియంత్రణలను విస్తరించాలని ప్రతిపాదించింది.
ప్రతిపాదిత నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ హెచ్ 1, షెడ్యూల్ ఎక్స్‌లోని ఔషధాలకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదు.
ఫార్మాసూటికల్ సరఫరా వ్యవస్థలో నియంత్రణాపరమైన పర్యవేక్షణను బలోపేతం చేయడం, ప్రిస్క్రిప్షన్ ఔషధాలకు సంబంధించి అనుమతులు లేని వాణిజ్య ప్రకటనలనూ, సొంత వైద్యంతో ముడిపడి ఉన్న ప్రమాదాలనూ తగ్గించడమే ప్రతిపాదిత సవరణ లక్ష్యం.
కొన్ని యాంటీబయాటిక్‌లు, సైకోట్రోపిక్ ఔషధాలు, వైద్యుని ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాల్సిన ఇతర ఔషధాలతో సహా వైద్య పర్యవేక్షణ అవసరమైన మెడిసిన్‌కు సంబంధించిన రక్షణ విధానాలను ఈ చర్య బలోపేతం చేస్తుందని అంచనా.
2026 ఫిబ్రవరి 16న నిర్వహించిన డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు 93వ సమావేశం అందించిన సిఫార్సుల ఆధారంగా ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఔషధాల అమ్మకం, పంపిణీ లైసెన్సులు ఉన్నవారు ఇస్తున్న వాణిజ్య ప్రకటనలకు సంబంధించి తగిన నిబంధనలను తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ సమావేశం గుర్తించింది.
ముసాయిదా నిబంధనలతో కూడిన గెజిట్ ప్రతులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోగా సంబంధిత నిపుణులు, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను మంత్రిత్వశాఖ ఆహ్వానించింది. సవరణను ఖరారు చేయడానికి ముందే నిర్దేశిత కాలపరిమితిలోగా అందిన సమర్పణలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
అధికారిక గెజిట్‌కు సంబంధించిన లింకు:
https://egazette.gov.in/WriteReadData/2026/276941.pdf
***
(రిలీజ్ ఐడి: 2321255)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11