మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
దక్షిణ ప్రాంతంలో ఎన్ఎమ్డిఎఫ్సి రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీల 3వ ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 5:11PM by PIB Vijayawada
భారత ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్, 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను దక్షిణ ప్రాంత రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీల మూడో ప్రాంతీయ సమీక్షా సమావేశాన్ని ఈ రోజు (09 అక్టోబర్ 2026)న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో నిర్వహించారు. ఎన్ఎమ్డిఎఫ్సి పథకాల అమలును సమీక్షించడంతో పాటు ఏజెన్సీలు ఎదుర్కొంటున్న నిర్వహణ పరమైన సమస్యలు, సవాళ్లను పరిష్కరించడంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది.
ఈ సమావేశానికి ఎన్ఎమ్డిఎఫ్సి చైర్పర్సన్; మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆభా రాణి సింగ్, ఐఆర్ఎస్ అధ్యక్షత వహించగా, కేరళ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ సజిత్ బాబు డి, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్ఎమ్డిఎఫ్సి సీనియర్ అధికారులు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఛానలైజింగ్ ఏజెన్సీల ప్రతినిధులు, భాగస్వామ్య బ్యాంకులు, ఎన్ఎస్ఐసి, డిఐసిసిఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఎన్ఎమ్డిఎఫ్సి పథకాల ప్రస్తుత అమలు స్థితి, గ్రాంట్-ఇన్-ఎయిడ్ పథకం, సోషల్ మీడియా కార్యక్రమాలు, మార్కెటింగ్ అసిస్టెన్స్ స్కీమ్, లోక్ సంవర్ధన్ పర్వ్ వంటి కార్యక్రమాలపై చర్చించారు. అలాగే సేవలను విస్తరించేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి కృత్రిమ మేథ వినియోగంపై ప్రత్యేక ప్రజెంటేషన్లు ప్రదర్శించారు. మైనారిటీ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి, వారిని బలోపేతం చేసేందుకు నిపుణుల అనుసంధానాన్ని సులభతరం చేయడం, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడంపై డిఐసిసిఐ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అలాగే.. ఎంఎస్ఎమ్ఇ గ్లోబల్ మార్ట్, ఒఎన్డిసి వేదికలపైకి లబ్ధిదారులను తీసుకురావడం వంటి కార్యక్రమాల ద్వారా మైనారిటీ చేతివృత్తుల వారు, లబ్ధిదారుల ఉత్పత్తుల విపణి సామర్థ్యాన్ని, మార్కెట్ ప్రాప్యతను పెంచడంపై దృష్టి సారించారు.

2025–26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాటాకు ఈక్విటీ భాగస్వామ్యం, డిమాండ్కు అనుగుణంగా బకాయిల చెల్లింపులు, నిధుల సమర్థవంతమైన వినియోగం అనే ప్రమాణాల ఆధారంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీలకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. ఎన్ఎమ్డిఎఫ్సి, దాని రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీలు, బ్యాంకింగ్ భాగస్వాముల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, నిర్వహణ సమస్యలను సమయానికి పరిష్కరించడం, పథకాల అమలును మెరుగుపరచడం, నిధుల సమర్థవంతమైన వినియోగం, అర్హులైన లబ్ధిదారులకు సేవలను విస్తృతంగా చేరవేయడం వంటి అంశాలపై చర్చలతో సమావేశం ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 2321394)
సందర్శకుల సూచీ సంఖ్య : : 38