శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకు సమష్టి కృషి అవసరం
ఎకోరెస్ 2026 జాతీయ సదస్సులో వక్తల పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 5:29PM by PIB Hyderabad
సీఎస్ఐఆర్–నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ) హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం, ఎన్ఈఈఆర్ఐ సస్టైనబిలిటీ హబ్, ఇండియన్ అసోసియేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ (ఐఏఈఎం) సంయుక్తంగా “పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ: పరిశ్రమలు, నియంత్రణ సంస్థల పాత్ర (ఎకోరెస్ 2026)” అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సును అక్టోబర్ 9, 2026న హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్-ఐఐసీటీ ప్రాంగణంలో నిర్వహించాయి.
ఈ సదస్సులో శాస్త్ర, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, నియంత్రణ సంస్థలు, పర్యావరణ రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొని పర్యావరణ వ్యవస్థల సుస్థిర పునరుద్ధరణ, సహజ వనరుల పరిరక్షణ, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యంపై చర్చించారు. వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతిక పరిష్కారాలు, సమర్థవంతమైన విధానాలు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన సమగ్ర విధానం అవసరమని సదస్సు నొక్కిచెప్పింది.

పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఏకలవ్య శర్మ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో స్థానిక సమాజాల భాగస్వామ్యం, బాధ్యత కీలకమని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ పెట్టుబడులు, సమర్థవంతమైన నియంత్రణ, శాస్త్రీయ నైపుణ్యం, తగిన సాంకేతిక పరిజ్ఞానం అవసరమని తెలిపారు. సహజ వనరులను సుస్థిరంగా నిర్వహించడంతోపాటు పర్యావరణ క్షీణతను నివారించేందుకు స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు.

సహజ వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పునర్భరణ, సుస్థిర నీటి నిర్వహణ, గాలి నాణ్యత మెరుగుదల, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలతో కూడిన సమగ్ర విధానాన్ని డాక్టర్ ఏకలవ్య శర్మ ప్రతిపాదించారు. హిమాలయ పర్యావరణ వ్యవస్థల పరిరక్షణను ప్రస్తావిస్తూ.. జీవవైవిధ్య సంరక్షణకు బహుళ ప్రయోజనాలను అందించే భూభాగాల సమగ్ర నిర్వహణ విధానం, శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక పరిష్కారాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించి పునరుజ్జీవింపజేసేందుకు పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సంస్థలు, విధానకర్తల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక దృక్పథంతో విస్తృతమైన ప్రణాళిక అవసరమని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్, శ్రీ ఏ.వి. రంగనాథ్, ఐపీఎస్ గౌరవ అతిథిగా సదస్సుకు హాజరయ్యారు. చెరువుల పునరుద్ధరణలో హైడ్రా నిర్వహిస్తున్న పాత్ర, చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. చెరువుల పునరుద్ధరణతోపాటు క్షీణించిన భూములను పర్యావరణపరంగా సుస్థిరమైన భూభాగాలుగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు.

సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్–ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొని, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు అందిస్తున్న సేవలను వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థపై సీఎస్ఐఆర్ పరిశోధనల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, పర్యావరణ సవాళ్ల పరిష్కారానికి పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సంస్థలు, విధానకర్తల మధ్య సహకారం అవసరమని పేర్కొన్నారు.

కెమికల్ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ శ్రీ ఎస్.ఎన్. శాస్త్రి మాట్లాడుతూ... పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకు సమగ్ర విధానం అవసరమని పేర్కొన్నారు. ప్రాజెక్టులు స్పష్టంగా నిర్వచించిన లక్ష్యాలు, విస్తృతమైన ఉద్దేశాలతో పర్యావరణ వ్యవస్థలు, భూభాగాలపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపాలని తెలిపారు. పారిశ్రామిక కార్యకలాపాల్లో వనరుల పునర్వినియోగం, వృత్తాకార ఆర్థిక విధానాలు, పునరుత్పాదక పద్ధతులను అనుసరించాలని సూచించారు.
సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ డైరెక్టర్, ఎకోరెస్2026 ఛైర్మన్ డాక్టర్ ఎస్. వెంకట మోహన్ స్వాగతోపన్యాసం చేసి, ఈ సదస్సు ప్రాధాన్యాన్ని వివరించారు. సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం చైర్ డాక్టర్ షేక్ బాషా సదస్సులో నిర్వహించే సాంకేతిక సమావేశాల వివరాలను తెలియజేశారు.

పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణను వేగవంతం చేయడం, వాటి స్థిరత్వాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం కోసం పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సంస్థలు, నియంత్రణ సంస్థలు, విధానకర్తలు, స్థానిక సమాజాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సదస్సు నొక్కిచెప్పింది.
***
(రిలీజ్ ఐడి: 2321432)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6