సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
అన్ని వర్గాలను కలుపుకొని పోయే, దీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే
భారత్ నిర్మాణానికి తోడ్పడుతున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు
సుస్థిర ప్రాతిపదిక కలిగిన జీవనోపాధి, మహిళా సాధికారత భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వాల ప్రతీకగా ఎదిగిన ఖాదీ
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 12:02PM by PIB Hyderabad
గ్రామీణ ప్రాంతాల్లో బతుకుదెరువు సాధనాలను బలపరచడంలో, ఉపాధి అవకాశాలను కల్పించడంలో, ఆత్మనిర్భర్ భారత్ దృష్టికోణాన్ని పటిష్ఠపరచడంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల (కేవీఐ)ది ఓ ముఖ్య భూమిక. భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వంతో పెనవేసుకున్న ఖాదీ పరిశ్రమ సాంప్రదాయిక హస్తకళాకౌశలాన్ని మన్నికైన ఉత్పాదన పద్ధతులతో ముడిపెడుతోంది. గ్రామీణ ప్రాంతాల నివాసులకు బతుకుదెరువును కూడా ప్రసాదిస్తోంది.
చేతితో వడకడం, నేత/అల్లిక పనితనం ద్వారా ఖాదీ తన రూపాన్ని సంతరించుకుంటుంది. ప్రాకృతిక నారలను, స్థానిక ఉత్పాదన వ్యవస్థలను ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. ఇది శ్రమపై ఆధారపడే, వికేంద్రీకృత ప్రక్రియ కావడం వల్ల వివిధ నైపుణ్య స్థాయుల్లో ఉద్యోగ అవకాశాలను అందిస్తూ, గ్రామీణ ప్రాంతాల నిరంతర అభివృద్ధికి దోహదం చేస్తోంది. ఈ రంగం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ)లో ఒకటో లక్ష్యం (పేదరిక నిర్మూలన)తో పాటు, ఎనిమిదో లక్ష్యానికి (తగిన పని, ఆర్థికాభివృద్ధి) దన్నుగా నిలుస్తోంది.
చేతులను ఉపయోగించి వడికే ప్రక్రియే ఖాదీకీ, చేతి మగ్గానికీ మధ్య ఉన్న ప్రధాన తేడాను సూచిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంఘం (కేవీఐసీ) నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యాల పెంపు, అదనపు ప్రావీణ్యాలను నేర్పించే కార్యక్రమాలను అమలుచేస్తూ ఖాదీ సంస్థలకు కావలసిన సహకారాన్ని సమకూరుస్తోంది. నూలు వడికే పనికి, నేత పనికి వేతన రేట్లను కిందటి సంవత్సరం ఏప్రిల్ నుంచి పెంచడం, మెరుగైన పనితీరును కనబరిచే పరికరాలను, మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడానికి దన్నునివ్వడం, మార్కెట్లో విక్రయాలకు మార్గాన్ని సుగమం చేయడం వంటి చర్యలు చేతివృత్తిదారుల ఆదాయాన్ని మెరుగుపరచడానికే కాకుండా సాంప్రదాయిక జీవనోపాధులను ఆర్థికంగా నిలకడతనం కలిగినవిగా తీర్చిదిద్దడానికి కూడా తోడ్పడ్డాయి.
సమకాలీన ఫ్యాషన్‌గా, జీవనశైలికి సంబంధించిన ఎంపికగా ఖాదీ ఎదిగింది. ఖాదీ డెనిమ్, డిజైనర్ చీరలు, పెళ్లికూతురు దుస్తులు, ఆధునిక షర్టులు, ట్రౌజర్స్ వంటి కొత్త ఉత్పాదనల శ్రేణులు నవతరం వినియోగదారుల్లో ఖాదీ ఆదరణను మరింత పెంపొందింపచేశాయి. ఢిల్లీ.. ఎన్ఐఎఫ్‌టీలో నెలకొల్పిన ఖాదీ శ్రేష్ఠతా కేంద్రం (సీఓఈ) వివిధ శ్రేణుల్లో 2,129 ఖాదీ డిజైన్ కలెక్షన్లను రూపొందించింది. 710 కొత్త ఉత్పాదనలతో నవ్‌యుగ్ ఖాదీనీ, ‘స్వధా’ పేరిట వెల్‌నెస్ యోగా వేర్ కలెక్షన్‌నీ పరిచయం చేయడం ఖాదీకి సమకాలీన వర్గాల్లో ఆదరణను మెరుగుపరిచాయి.
ఖాదీ వికాస్ యోజన, గ్రామోద్యోగ్ వికాస్ యోజన, పీఎమ్ఈజీపీ వంటి పథకాలను ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చి ఖాదీ గ్రామీణ పరిశ్రమల రంగంలో ఉపాధికల్పనను ప్రోత్సహిస్తున్నది. ఆర్థిక సహాయాన్ని అందించడం, నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకోవడానికి మార్గాన్ని సుగమం చేయడం, నాణ్యమైన ముడిపదార్థాలు, శిక్షణ, టూల్‌కిట్స్, వేతన సబ్సిడీ, విక్రయ దశలో సూచనలనూ సలహాలనూ ఇవ్వడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, సామాజిక భద్రతా చర్యలను చేపట్టడం ద్వారా వివిధ రూపాల్లో సహాయాన్ని అందిస్తున్నారు. అనేక పథకాలు అమలు కావడంతో 75 శాతం కన్న ఎక్కువ మంది చేతివృత్తిదారుల ఆదాయం చెప్పుకోదగ్గ మేరకు వృద్ధి చెందిందని అహమదాబాద్‌లోని ఈడీఐఐ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.
మహిళలకు ఆర్థిక సాధికారత కల్పన, సమ్మిళిత అభివృద్ధి అన్న లక్ష్యాల సాధనకు ఖాదీ సహకరిస్తోంది. దాదాపు అయిదు లక్షల మంది ఖాదీ చేతివృత్తిదారులలో 80 శాతం వరకూ మహిళలే. అగర్‌బత్తి, చేతితో తయారు చేసే కాగితం, తేనె ఉత్పాదన, సేవల పరిశ్రమలు వంటి రంగాల్లో వీరి భాగస్వామ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ఇది వారికి ఆర్థిక స్వాతంత్య్రంతో పాటు, సుస్థిర జీవనోపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది.
చేతులతో తయారు చేసిన, గుర్తించదగిన, ప్రాకృతిక, పర్యావరణానుకూల ఉత్పాదనలకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతుండటంతో ఖాదీ ఉత్పాదనలకూ, చేతితో రూపొందించిన వస్తువులకూ ఎగుమతి అవకాశాలు గణనీయంగా వృద్ధి చెందాయి. కేవీఐసీని న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్రేడ్ పోర్టల్‌లో ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఈపీసీ) హోదాతో నమోదు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖాదీ సంస్థలకు మరిన్ని అవకాశాలను అందించేందుకూ చర్యలు చేపట్టారు.
ఖాదీ ఉత్పాదనలకు బ్రాండు గుర్తింపును ప్రోత్సహించడానికీ, మార్కెట్టులో వాటి ఉనికిని బలోపేతం చేయడానికీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు చిహ్నం (జీఐ) దక్కడంతో దీని ప్రత్యేక పత్తి ఉత్పాదనలకు, సాంప్రదాయిక నూలు, నేత ప్రక్రియలకు మెరుగైన ధర లభిస్తుందని భావిస్తున్నారు. పొందూరు ఖాదీ, భారత్ కస్తూరి పత్తి, బెంగాల్ మజ్లిన్, ప్రాకృతిక రంగులు వేసిన పత్తి వస్త్రాలను ఆగ్రాలో నిర్వహించిన బ్రిక్స్ ఎమ్ఎస్ఎమ్ఈ ఫోరమ్ తొలి కార్యక్రమంలో ప్రదర్శించారు.
సాంప్రదాయిక పద్దతులను సంరక్షించడమే కాక సాంకేతిక ఉన్నతీకరణతో పాటు నాణ్యతను పెంచే ప్రయత్నాలను కూడా చేస్తున్నారు. కేవీఐసీ ఆధీనంలోని సెంట్రల్ సిల్వర్ ప్లాంటులను ఆధునికీకరిస్తున్నారు. వీటిలో కర్నాటక.. చిత్రదుర్గ, కేరళ.. కుత్తూర్ లోని ప్లాంటుల ఆధునికీకరణను ఇప్పటికే పూర్తి చేశారు. చిత్రదుర్గ ప్లాంటు తన అవసరాల్లో 50 శాతం అవసరాలను తీర్చుకోవడానికి సౌర శక్తిని వినియోగించుకొంటోంది. పర్యావరణ స్థిరత్వాన్ని మరింత పటిష్ఠపరిచే ఉద్దేశంతో పవన విద్యుత్తును వినియోగించుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. గ్రామీణ పరిశ్రమల క్లస్టర్లను పటిష్ఠపరచే ఉద్దేశంతో ఖాదీ సంస్థలలో సాంకేతికతను ఉన్నతీకరించడం, సాంకేతికత ఆధారిత కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.
****
(రిలీజ్ ఐడి: 2321447)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9